ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక అయిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రైల్వే బోర్డుతోపాటు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి ప్రకటించారు. 

విశాఖ రైల్వే జోన్ కు పేరు కూడా పెట్టారు.ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని షెడ్యూల్‌ 13 ఎనిమిదో ఆర్టికల్‌ ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు.అయితే నూతన రైల్వేజోన్ కు  సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా ప్రకటిస్తూ అధికారిక ప్రకటన వెలువరించారు. షార్ట్ కట్ లో ఎస్.ఈ.వో.ఆర్ గా ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించిన నేపథ్యంలో వాల్తేరు డివిజన్ ను రాయగఢ్ కు మార్చబోతున్నట్లు ప్రకటించారు. 

అలాగే విజయవాడ, గుంతకల్ డివిజన్లు ఎప్పటిలాగే డివిజన్ల మాదిరిగానే ఉంటాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. విభజన చట్టంలోని హామీలలో భాగంగా రైల్వోజోన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ పనిచేస్తుందని తెలిపారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్ల పరిధిలో సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ఉండబోతుందన్నారు. వాల్తేరు డివిజన్ ను రాయగడకు మార్చబోతున్నట్లు తెలిపారు. వాల్తేరు డివిజన్ ను రెండు విభాగాలుగా విభజించనున్నట్లు స్పస్టం చేశారు. 

ఒక భాగం సౌత్ కోస్ట్ రైల్వో జోన్ లోని విజయవాడ డివిజన్ గా ఉంటుందని తెలిపారు. మిగిలిన భాగం రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్ గా ఉంటుందని తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లుగా కొనసాగుతాయన్నారు. 

రైల్వే జోన్ పై బుధవారం చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రైల్వే బోర్డుతో చర్చించి మిగిలిన నిబంధనలను రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఇకపోతే ప్రధాని నరేంద్రమోది మార్చి 1న ఏపీలో పర్యటిస్తున్నారు. 

మార్చి1న విశాఖపట్నంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్రమోదీ. మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు విశాఖరైల్వే జోన్ ప్రకటించారు. ఇకపోతే దశాబ్ధాల కాలంగా విశాఖ రైల్వే జోన్ అంశం పెండింగ్ లో ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశంపై ఉత్తరాంధ్ర వాసులు దశాబ్ధాల కాలంగా పోరాటం చేస్తున్నారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ ప్రకటించడంతో వారి కల నెరవేరినట్లైంది.