తిరుపతి: తాను ఏ పార్టీకి కూడా చెందినవాడిని కాదని, తన వెనక ఏ పార్టీ ప్రోద్బలం కూడా లేదని అంటూనే ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. 

చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని మోహన్ బాబు అన్నారు. 2014 - 15 నుంచి ప్రభుత్వం తమ విద్యాసంస్థ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వడం లేదని, తాను లేఖ రాసిన చంద్రబాబు స్పందించలేదని ఆయన అన్నారు. మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ అనే విద్యాసంస్థను నడుపుతున్న విషయం తెలిసిందే.

తాను ఏ పార్టీకీ చెందినవాడిని కాదని, తన మాటల వెనక ఓ పార్టీ ప్రోద్బలం కూడా లేదని ఆయన అన్నారు. విద్యాభివృద్ధిపై ఎపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటింటికీ తిరిగి హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేస్తూ అమలుకు సాధ్యం కాని హామీలు ఎందుకు ఇచ్చారని అడిగారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టారని, అప్పట్లో కోట్లాదిమంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు అంటే తనకు ఇష్టమని, అయినా తనకు ఫీజు బకాయిలు చెల్లించలేదని ఆయన అన్నారు. 

చంద‍్రబాబు అనేకసార్లు తమ కాలేజీకి వచ్చారని,  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 2014 నుంచి 2018 వరకూ రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. 2017-2018 సంవత్సరంలో కొత్త నిబంధనలు పెట్టారని,. మూడు నెలలకు ఓసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకూ బకాయిలు చెల్లించలేదని అన్నారు. 

భిక్షం వేసినట్లు కొద్దిగా ఇస్తున్నారని అన్నారు. ఇలాగైతే విద్యార్థులు ఎలా చదవాలని, అధ్యాపకులకు జీతాలు ఎలా చెల్లించాలని ఆయన ప్రశ్నించారు. దాదాపు రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అంటూ ఎంతకాలం ఇలా అని అడిగారు. తనకు ఏ కులం లేదని, తాను అందరివాడినని అన్నారు.

తాను నాణ్యత లేని విద్యను ఇవ్వబోనని, తమ విద్యాసంస్థలలో ర్యాగింగ్‌ ఉండదని, తాను రాజకీయం కోసం మాట్లాడలేదని, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేకుంటే మరింత ఆందోళనకు సిద్ధమని అన్నారు.