టీడీపీ నేతలు నిందలు వేశారని.. జగన్ అమరావతిలో నివాసం ఏర్పాటు చేసుకోలేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. బుధవారం ఉదయం ఏపీలో జగన్ నూతన గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై రోజా స్పందించారు.

అమరావతి కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగించాలనే ఉద్దేశంతోనే జగన్ అమరావతిలో నివాసం, పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారని ఆమె అన్నారు. జగన్ సీఎం అయితే.. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అమరావతిలో వైఎస్‌ జగన్‌ స్థిర నివాసం, పార్టీ కార్యాలయ నిర్మాణాలు ఎల్లో మీడియాకు చెంపపెట్టు లాంటిదని అన్నారు.

చంద్రబాబుకు అయిదేళ్లు అధికారం కట్టబెట్టినా రాజధానిలో స్థిర నివాసం గానీ, పార్టీ కార్యాలయం గానీ నిర్మించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఏపీకీ జగన్‌ పర్మనెంట్‌ సీఎం అవుతారని, బాబు టెంపరరీ సీఎంగా మిగిలిపోతారని ఆమె జోస్యం చెప్పారు. గృహ ప్రవేశం.. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాలకు వైఎస్సార్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆహ్వానాలు అందాయని తెలిపారు. కానీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు ఇంట్లోకి అనుమతి లేదని ఎద్దేవా చేశారు.