మెగా బ్రదర్ నాగబాబు.. తన యూట్యూబ్ లో మరో వీడియో వదిలారు. ఈసారి టీడీపీ  అధికార ప్రతినిధి సాధినేని యామినిని టార్గెట్ చేసి.. కౌంటర్ ఇచ్చారు. జనసేన కార్యకర్తల అరెస్టుని నిరసిస్తూ..దాదాపు పది నిమిషాల వీడియోని విడుదల చేశారు.

ముందుగా జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసే విజువల్స్ చూపించారు. అనంతరం ఈ విషయంపై నాగబాబు మాట్లాడారు. ఈ విషయం తనకు కాస్త ఆలస్యంగా తెలిసిందని.. కరెక్ట్ టైమ్ లో తెలిస్తే.. విషయం వేరేలా ఉండేదన్నారు. సాధినేని యామినని జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారని.. ట్రోల్ చేయడం తప్పేమీకాదన్నారు.

కాకపోతే.. ఆ ట్రోల్ నిజంగా బాధపెట్టేలా ఉంటే.. పరువునష్టం దావా వేయవచ్చని..  ఆవిషయం సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అయితే.. అరెస్టు చేయకూడదని కోర్టులు చెబుతున్నాయన్నారు. ఇలా అరెస్టు చేసి జనసేన కార్యకర్తల మనో స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దీనికి లోకేష్, పార్టీ హెడ్‌గా చంద్రబాబు, ఏపీ హోం మినిష్టర్ చినరాజప్ప బాధ్యత వహించాలన్నారు.

‘ఎందుకంటే వాళ్లు ఏమైనా మర్డర్లు చేశారు, దేశ ద్రోహం చేశారా? టెర్రరిస్టులా.. మానభంగాలు చేశారా.. ఎందుకంతగా రియాక్ట్ అవుతున్నారు. అధికారంలో ఉన్న మీ నాయకురాలిని ఒక్కమాట అంటే ఇంత దారణంగా వ్యవహరిస్తారా? శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. అరెస్ట్ చేయడం వరకే మీ పని. థర్డ్ డిగ్రీ ప్రయోగించి రక్తాలు కారేలా కొట్టడమా. సాధినేని యామిని వీళ్ల దగ్గరకు వచ్చి ఆమె కూడా కొట్టినట్టు తెలుస్తోంది. మీ అరాచకాలు ఇంత దారుణంగా ఉన్నాయి. మీకు కాలం దగ్గర పడింది. వచ్చే ఎన్నికలే మీకు సరైన సమాధానం చెబుతాయి.’

‘మా తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు కాబట్టి అతనికి ఇబ్బందులు కలగకూడదని పార్టీలో జాయిన్ కాలేదు. కాని నేను జనసేన అభిమానిని. ఇంకోసారి జనసైనికులపై ఇలాంటి దాడులకు పాల్పడితే.. నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతా. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని హెచ్చరిస్తున్నా.’ అని నాగబాబు అన్నారు. పూర్తి వీడియో కింద చూడండి.