విశాఖపట్నం: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. చంద్రబాబులాంటి డ్రామా యాక్టర్‌ మరొకరు లేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన కన్నా ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి ద్రోహం చేసిందని ఆరోపించిన చంద్రబాబు నేడు మాట మార్చారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను మించిన మంచిపార్టీ మరొకటి లేదంటున్నారని ఇంకా ఎన్ని యూ టర్న్ లు తీసుకుంటారు చంద్రబాబు అని నిలదీశారు. 

చంద్రబాబు మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రజలు మాట్లాడుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బీజేపీ మీద బురద చల్లడం, తీయడం అలవాటుగా చేసుకున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇచ్చిన ప్రాజెక్టులను ఒక్కోటి వివరిస్తూ బాబుకు సవాల్‌ విసిరారు. 

మార్చి1న ప్రధాని నరేంద్రమోదీ సభను విజయవంతం చెయ్యాలని కోరారు. మోదీ సభకు హాజరై ఆయన ఏమి మాట్లాడతారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఉందన్నారు. ప్రధాని పర్యటన రోజు విశాఖపట్నం రైల్వే జోన్ పై ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

మరోవైపు  పాక్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందిని ఆయన అభినందించారు. ఇంకా సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతోన్న వారికి మనోధైర్యం కలగాలని ఆశిస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.