వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. రాజధాని అమరావతిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్ పనిగట్టుకొని.. టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. 54 లక్షల ఓట్లు తొలగించాలన్నది జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను అపహాస్యం చేసేలా జగన్ ప్రవర్తిస్తున్నారని, ఈసీ పనితీరునే ఆయన తప్పుపడుతున్నారని కనకమేడల మండిపడ్డారు.
కేసుల పేరుతో డేటా మొత్తం చోరీ చేశారని, ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. పార్టీ డేటా నిక్షిప్తం చేసేందుకు టీఆర్‌ఎస్‌కూ ఓ సంస్థ ఉందని, వర్సిటైల్ మొబిటెక్ సంస్థ టీఆర్‌ఎస్‌కు పనిచేస్తోందని కనకమేడల తెలిపారు.
ప్రజల్లో అపోహాలు సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేయడానికి జగన్.. టీఆర్ఎస్ తో జతకట్టారని ఆరోపించారు. పార్టీ డేటా, సేవామిత్రల డేటాను దొంగిలించడం నేరమని కనకమేడల అన్నారు.
ఈ కుట్రలో భాగస్వాములపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి బీజేపీ నేతలే సలహాదారులని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ నేతలు సమర్థిస్తున్నారని, ఏపీలో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఓ రాష్ట్ర వ్యవహారాల్లో... మరో రాష్ట్రం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
