కుటుంబ పాలన అని మోదీ తనను విమర్శింస్తున్నారని, ఆయనకు కుటుంబం ఉంటే కదా తెలిసేదని చంద్రబాబు అన్నారు. ఎవరి వారసులైనా సామర్థ్యం ఉంటేనే రాణిస్తారని, మోదీ నన్ను బెదిరించాలని చూస్తున్నారని అన్నారు. 

అమరావతి: ప్రధాని మోడీ రాష్ట్రానికి ఏమీ చేయరని, తనను తిట్టడానికే వస్తారని, ఒకవేళ తాను కనిపిస్తే కొడతారేమోనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖ సభలో మోదీ తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో తూర్పు గోదావరి జిల్లా పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. 

కుటుంబ పాలన అని మోదీ తనను విమర్శింస్తున్నారని, ఆయనకు కుటుంబం ఉంటే కదా తెలిసేదని చంద్రబాబు అన్నారు. ఎవరి వారసులైనా సామర్థ్యం ఉంటేనే రాణిస్తారని, మోదీ నన్ను బెదిరించాలని చూస్తున్నారని అన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐలను చూపిస్తున్నారని అన్నారు. నాడు తిరుపతిలో బాంబులేస్తేనే భయపడలేదని అన్నారు.

పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మన వైమానిక దళ సిబ్బంది సాహసోపేతంగా చేసిన దాడిని అభినందించామని చంద్రబాబు చెప్పారు. ఆ సమయంలో మోదీ రాజస్థాన్‌లో రాజకీయ సమావేశం పెట్టి దేశాన్ని నేనే కాపాడుతున్నానని చెప్పుకొచ్చారని అన్నారు. 
కీలకమైన ఆ సమయంలో ఢిల్లీలో ఉండి, అఖిలపక్ష సమావేశం పెట్టి, అందరినీ కలుపుకొని పోవాల్సిన ప్రధాని రాజస్థాన్‌లో రాజకీయ సభలో పాల్గొన్నారని, అలాంటి వ్యక్తి... మన దేశభక్తిని శంకిస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని బిజెపి నేతలు తనతో చెప్పినట్లు పవన్ కల్యాణ్ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు.


వాల్తేరు డివిజన్‌ను ఎత్తివేసి, 7000 కోట్ల ఆదాయాన్ని రాయగఢ్ డివిజన్‌కు ఇచ్చేశారని చంద్రబాబు విశాఖ జోన్ ఇవ్వడంపై వ్యాఖ్యానించారు. తమ జోన్‌కు డబ్బుల్లేకుండా మాయా జోన్‌ ఇచ్చారని, డివిజన్‌ లేకుండా జోన్‌ ఇవ్వడమే మోదీ మాయాజాలమని అన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పడాన్ని ఆయన తిప్పికొట్టారు. హుద్‌హుద్‌ సహాయంగా వెయ్యికోట్లు ఇస్తామని... 640 కోట్లు మాత్రమే ఇచ్చారని, తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు మోదీ రాలేదని, ఇదేనా ఉత్తరాంధ్ర పట్ల మోడీ అభిమానమని అన్నారు. 

విభజన చట్టం ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 వెనుకబడిన జిల్లాలకు 24వేల కోట్లు ఇవ్వాలని, అయితే ఏడు జిల్లాలకు ఆరేళ్లపాటు రూ.350 కోట్ల చొప్పున ఇస్తున్నారని అన్నారు. హక్కుల కోసం నిలదీయడం మొదలు పెట్టేసరికి ఆ నిధులు కూడా ఆపేశారని అన్నారు. రూ.350 ఖాతాలో వేసి దౌర్జన్యంగా మరీ వెనక్కి తీసుకున్నారని తప్పు పట్టారు. 

కడప ఉక్కు ఇవ్వకున్నా వైసీపీ అధినేత జగన్‌ మాట్లాడడం లేదంటే ఏమనుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పట్టుదలకు 35 ఏళ్ల చరిత్ర ఉందని, మహానాయకుడు సినిమా చూస్తే అర్థమవుతుందని అన్నారు. అవసరమైతే మోదీకి ఇంకోసారి సినిమా చూపిస్తామని అన్నారు.