అమరావతి: కేంద్రప్రభుత్వం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్ మసిపూసిన మారేడు కాయగా అభివర్ణించారు. గురువారం ఉదయం టీడీపీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో కేంద్రం తీరుపై మండిపడ్డారు. 

ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నుతున్నారంటూ చంద్రబాబు విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన మరో కుట్ర అంటూ మండిపడ్డారు. అయితే బీజేపీ చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

విశాఖ రైల్వే జోన్ ప్రకటించడంపై సంబరపడుతోన్న వైసీపీ బీజేపీకి వత్తాసు పలుకుతోందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మరోవైపు రాజధాని అమరావతిని తరలించాలని వైసీపీ మనసులో కుట్ర పెట్టుకుందని చంద్రబాబు ఆరోపించారు. 

ఇప్పుడు ఆ అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఏమీచేయలేక రాజధానిని తరలించబోమని చెబుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ మార్చి1న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

మార్చి ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో చంద్రబాబు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇకపోతే బుధవారం సాయంత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు. అంతేకాదు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా నామకరణం కూడా చేశారు. విశాఖ రైల్వే జోన్ ను అన్ని పార్టీలు స్వాగతిస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.