ప్రతిపక్షనేత, వైసీసీ అధినేత వైఎస్ జగన్ గృహ ప్రవేశం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆయనపై విరుచుకుపడ్డారు. అమరావతిలో ఇవాళ పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన దేశభక్తిలో తెలుగుదేశం పార్టీ అందరికన్నా ముందే ఉంటుందని, దేశ సమగ్రతలో టీడీపీ రాజీపడదన్నారు.

పాకిస్తాన్ దాడులను అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. జవాన్ల కుటుంబాలకు మన ఉద్యోగల విరాళం దేశానికే స్ఫూర్తినిస్తుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులంతా కలిసి రూ.30 కోట్లు విరాళంగా ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు.

భారత వాయుసేన ధైర్యసాహసాలను అభినందిస్తున్నానన్నారు. రాష్ట్ర హక్కుల కోసం ఓ వైపు రాజీలేని పోరాటం చేస్తూనే మరోవైపు దేశ సార్వభౌమాధికారానికి సంఘీభావం తెలుపుతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు సృష్టిస్తోందని సీఎం మండిపడ్డారు. రాజధాని అమరావతిలోనే అని మేనిఫెస్టో‌లో పెడతారట, ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.

నాలుగేళ్లుగా మన గడ్డ మీద నుంచే పాలన సాగిస్తున్నామని, అందరికీ అందుబాటులో రాష్ట్ర నడిబొడ్డున అమరావతిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ దుర్బుద్ధి ఏంటో ఇప్పుడు బయటపడిందని, జగన్ ఇప్పటికీ హైదరాబాద్ విడిచి రాలేదని ఎద్దేవా చేశారు.

ప్యాలెస్ ఉంటే తప్ప జగన్ ఇక్కడ నివసించడని, ఎక్కడికి వెళ్లినా రాజ ప్రసాదాల్లోనే జగన్ బస చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ పేదల పార్టీ కాదని, ప్యాలెస్ల పార్టీ అంటూ విరుచుకుపడ్డారు.