అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీల పదవుల సందడి నెలకొంది. ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు, గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఒకటి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటికి అభ్యర్థులను బుధవారం అర్థరాత్రి ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. గత కొద్ది రోజులుగా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 

ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి దక్కుతుందా అంటూ అంతా ఉత్కంఠతో ఎదురుచూశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ప్రకటిస్తారంటూ  చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు. 

ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు పేర్లను ఖారారు చేశారు. గవర్నర్ కోటాలో శివనాథ్ రెడ్డి, శమంతకమణి పేర్లు , విశాఖ స్థానిక సంస్థల కోటాలో బుద్దా నాగజగదీశ్వర్ పేర్లను చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. 

ఈ అభ్యర్థులతో గురువారం నామినేషన్లు దాఖలు చెయ్యాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఏడు ఎమ్మెల్సీ పదవులకు గానూ నాలుగు స్థానాలు బీసీలకే కేటాయించారు చంద్రబాబు. 

రెండు స్థానాలను అగ్రవర్ణాలకు కేటాయించగా కాపు ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు చంద్రబాబు. మహిళా కోటాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శమంతకమణికి మరోసారి టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. 

ఈసారి అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సామాజిక సమీకరణాలకే పెద్దపీట వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈసారి ఎంపికలో బీసీల నుంచి రజక,గవర, బోయ, యాదవ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారు చంద్రబాబు. 

అలాగే రాయలసీమ, మహిళా ఎస్సీ మాదిక కోటాలో శమంతకమణికి అవకాశం కల్పించారు. ఇకపోతే ఇటీవలే కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఏర్పడ్డ ఎమ్మెల్సీ స్థానాన్ని శివనాథ్ రెడ్డికి కేటాయించగా, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామాతో ఏర్పడ్డ స్థానాన్ని శమంతకమణికి కేటాయించారు. 

బోయ సామాజిక వర్గం నుంచి టీబీ నాయుడుకు ఛాన్స్ దక్కగా విశాఖపట్నం గీతం విద్యా సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతితో ఖాళీ అయిన స్థానాన్ని బుద్దా నాగ జగదీశ్వర్ కు కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.