నెల్లూరు వైసీపీలో ముసలం పుట్టింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డికి గత కొన్ని నెలలుగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా కోటంరెడ్డి అరెస్ట్‌తో ఈ విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీడీవో సరళపై దాడి చేశారని కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కాకాణి స్కెచ్ ఉందని ఆరోపిస్తున్నారు శ్రీధర్ రెడ్డి.

దీంతో జిల్లా వైసీపీలో రాజకీయ దుమారం మొదలైంది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో నెల్లూరు వైసీపీ నేతలు భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వరప్రసాద్ తదితరులు హాజరై ఇద్దరు నేతల మధ్య వివాదంపై చర్చిస్తున్నారు.