అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా మాజీఎంపీ, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డిని నియమించినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసినట్లు సమాచారం. 

టీటీడీ చైర్మన్ గా వెళ్లేందుకు వైవీ సుబ్బారెడ్డి సుముఖంగా లేరని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీటీడీ చైర్మన్ గా ఉండాలని జగన్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. అవకాశం వస్తే రాజ్యసభకు పంపిస్తానని జగన్ వైవీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

టీటీడీ పాలక మండలి ఇంకా రద్దుకాలేదు. దీంతో అధికారికంగా ప్రకటిన వెలుడలేదని తెలుస్తోంది. పాలకమండలిని ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తే అధికారికంగా ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది. ఇకపోతే వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న. వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మ చెల్లెలు స్వర్ణలత భర్త వైవీసుబ్బారెడ్డి.

2014 ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీలో పొలిటికల్ అడ్వైజర్ గా కొనసాగుతున్నారు. 

అంతేకాదు ఉభయగోదావరి జిల్లాలకు ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆయన పాత్ర ప్రత్యేకగమని చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో ఆయనను తప్పించి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి అవకాశం ఇచ్చారు. 

2019 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఘన విజయం సాధించారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో వైవీ సుబ్బారెడ్డి అలకపాన్పు ఎక్కారు. అనంతరం జగన్ బుజ్జగించడంతో ఆయన అలకపాన్పు వీడారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు వైవీ సుబ్బారెడ్డి.