కడప: వచ్చే ఎన్నికల్లో  వైసీపీ 120 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధీమాను వ్యక్తం చేశారు. పాదయాత్రలు చేసిన వారంతా ముఖ్యమంత్రులు అయ్యారని, జగన్ కూడ సీఎం అవుతారని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

వైఎస్ విజయమ్మ ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై  తన అభిప్రాయాలను వెల్లడించారు.  పాదయాత్ర ద్వారా జగన్  నాయకుడిగా ప్రజల్లో నమ్మకం  కల్పించారని విజయమ్మ చెప్పారు.

అసెంబ్లీలో  ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చివరి వరకు ప్రయత్నించారని చెప్పారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని ఆమె గుర్తు చేశారు. ఈ విషయమై అసెంబ్లీ కంటే ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకుగాను పాదయాత్రను జగన్ ఎంచుకొన్నాడని ఆమె చెప్పారు.

జైల్లో ఉన్న కాలంలో మినహా ఎప్పుడూ కూడ జగన్ ప్రజల మధ్య ఉండేందుకే ప్రయత్నం చేశారని చెప్పారు. ఓదార్పు యాత్ర, ప్రత్యేక హోదా, రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలను నిర్వహించారని ఆమె చెప్పారు. 

తమ కుటుంబంలో వైఎస్ఆర్, షర్మిల, జగన్ పాదయాత్రలు నిర్వహించారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించిన సమయంలో  రాష్ట్రంలో తీవ్రమైన కరువు సమస్యలు ఉన్నాయని చెప్పారు. వరుస కరువు కారణంగా ప్రజల సమస్యలను తెలుసుకొంటూనే వారికి తాను అండగా ఉంటానని పాదయాత్ర ద్వారా ధైర్యం కల్గించారని విజయమ్మ గుర్తు చేసుకొన్నారు.

ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా జగన్  తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే పాదయాత్ర చేశారని చెప్పారు.జగన్‌పై దాడి చేసిన సమయంలో టీడీపీ నేతలు చేసిన ప్రచారం తనకు ఎంతో బాధను కల్గించిందని చెప్పారు.

జగన్‌పై దాడి ఘటనను తమ కుటుంబానికి కూడ అంటగట్టే ప్రయత్నం చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. రాజకీయాల్లో ఇంత దిగజారి కూడ మాట్లాడుతారా అని ఆమె ప్రశ్నించారు.  

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీతో కలిసేందుకు తాము సిద్దంగా ఉన్నామని  విజయమ్మ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో  వైసీపీకి 120 సీట్లు వస్తాయని ఆమె ధీమాను వ్యక్తం చేశారు. తన అవసరం ఉందని జగన్ భావిస్తే ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదని ఆమె స్పష్టం చేశారు.