కడప:మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి వైఎస్ఆర్‌సీపీ షాక్ ఇచ్చింది. వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్టుగా వీరశివారెడ్డి ఇటీవలనే  ప్రకటించారు.తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వీరశివారెడ్డి పార్టీ మారినా కూడ ప్రయోజనం దక్కలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పోలింగ్ రోజున వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి రవీంద్రనాథ్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఆయన టీడీపీలోనే ఉన్నాడు. కమలాపురం లేదా ప్రొద్దుటూరు టిక్కెట్ల కోసం వీరశివారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. 

కానీ, వీరశివారెడ్డికి చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చాడు. కమలాపురంలో  తన ప్రత్యర్ధి పుత్తా నరసింహారెడ్డికే చంద్రబాబునాయుడు టిక్కెట్టు కేటాయించాడు,. దీంతో పుత్తా నరసింహారెడ్డికి మద్దతివ్వలేక రవీంద్రారెడ్డికి మద్దతు ఇచ్చాడు. 

ఎన్నికలు పూర్తైన తర్వాత ఇటీవల కాలంలో టీడీపీకి రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు. త్వరలోనే వైఎస్ఆర్‌సీపీలో చేరుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.

 తన కొడుకు అనిల్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం  వీరశివారెడ్డి వైఎస్ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయం  తీసుకొన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కడప జిల్లా డీసీసీబీ ఛైర్మెన్  గా ఉన్న తిరుపాల్ రెడ్డిని తప్పించి అనిల్ కుమార్ రెడ్డి డీసీసీబీ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది.

అయితే డీసీసీబీ ఛైర్మెన్ గా అనిల్ కుమార్ రెడ్డిని కొనసాగించాలని  వీరశివారెడ్డి వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం వద్ద ప్రతిపాదించినట్టుగా సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు వైఎస్ఆర్‌సీపీ నుండి సానుకూలంగా స్పందన రాలేదని సమాచారం.

వైఎస్ జగన్  కడప జిల్లా పర్యటనలో  వీరశివారెడ్డి వైఎస్ఆర్సీపీ తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  వీరశివారెడ్డి స్వంత గ్రామం కోగంటలో టీడీపీ అభ్యర్ధి పుత్తా నరసింహారెడ్డికి 600 ఓట్లు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి రవీంద్రనాథ్ రెడ్డి కంటే ఎక్కువ వచ్చాయి. ఈ పరిణామాలను  వైఎస్‌ఆర్‌సీపీ నిశితంగా పరిశీలిస్తోంది.