విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోదరుడు, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యారు. 

రుషికొండలోని ఓ రిసార్ట్స్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. పెండ్లి కుమార్తె యామిని, పెండ్లికుమారుడు రవితేజలను ఆశీర్వదించారు. స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్ అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకున్నారు. 

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ చేరుకున్న వైఎస్ జగన్ కు విశాఖపట్నం జిల్లా వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్స్ లో జరగుతున్న వివాహ వేడుకలో పాల్గొన్నారు వైఎస్ జగన్. 

వైఎస్ జగన్ ను చూసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. జై జగన్, సీఎం అంటూ నినాదాలతో పెళ్లిమండపాన్ని హోరెత్తించారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం వైఎస్ జగన్ తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.