అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు నైతిక విలువలు పాటించడం లేదని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పోలవరం రివర్స్ టెండరింగ్ విధానం మంచి ఫలితాలను రాబడుతుంటే దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల రూ.7,500 కోట్లు నష్టం వస్తుందని కాకి లెక్కలు చెప్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో ఐదు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 

వరుస కరువు వల్ల వ్యవసాయ రంగం లక్ష కోట్ల ఉత్పత్తి కోల్పోయిందని చెప్పుకొచ్చారు. కరువును కూడా రాజకీయం చేయడం చంద్రబాబు నాయుడుకే చెల్లిందని విమర్శించారు విజయసాయిరెడ్డి. వ్యవసాయం గురించి ఆనాడు మాట్లాడితే బాగుండేదని సూచించారు. 

మరోవైపు ఏపీలోని ఎల్లో మీడియా వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. డీఎంకే పార్టీ మురసోలి అనే పత్రికను నడుపుతోందని అలాగే శివసేన పార్టీ సొంత పత్రిక ‘సామ్నా’ అని చెప్పుకొచ్చారు. 

ఆ పత్రికలు ప్రత్యర్థి పార్టీలను విమర్శలతో చీల్చి చెండాడినా నైతిక విలువలు పాటిస్తాయని చెప్పుకొచ్చారు. అవాస్తవాలు రాయవన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మౌత్ పీస్ అయిన కిరసనాయిలు మాత్రం జర్నలిజం ముసుగులో విషం కక్కుతున్నాడంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు.