ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఫిబ్రవరి 1వ తేదీన ఏపీ రాష్ట్ర బంద్‌‌కు  ప్రత్యేక హోదా సాధన సమితి తలపెట్టిన  బంద్‌కు తాము  మద్దతు ఇవ్వడం లేదని  వైసీపీ ప్రకటించింది


అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఫిబ్రవరి 1వ తేదీన ఏపీ రాష్ట్ర బంద్‌‌కు ప్రత్యేక హోదా సాధన సమితి తలపెట్టిన బంద్‌కు తాము మద్దతు ఇవ్వడం లేదని వైసీపీ ప్రకటించింది. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ చిత్తశుద్దితో పోరాటం చేస్తున్న పార్టీ వైసీపీయేనని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ రాజీలేని పోరాటం చేస్తోందని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. బుధవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. 

ప్రత్యేక హోదా కోరుతూ గతంలో తాము రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన సమయంలో ప్రత్యేక హోదా సాధన సమితి కొన్ని కారణాలతో బంద్‌కు మద్దతు ఇవ్వలేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యేక హోదా సాధన సమితి నిర్వహిస్తున్న బంద్‌కు తాము మద్దతివ్వడం లేదన్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా కోసం గతంలో నాలుగు దఫాలు రాష్ట్ర బంద్‌ నిర్వహించామన్నారు. మరో వైపు వైసీపీ చీఫ్ జగన్ ‌ గుంటూరులో 8 రోజుల పాటు దీక్షలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక సాధన సమితి చిత్తశుద్దితో కార్యక్రమాలను చేయడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.