అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. ఆర్టికల్ 370 రద్దును ఆసరాగా చేసుకుని చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

ప్రజల అదృష్టం బాగుండి చంద్రబాబు అధికారంలో లేరు గానీ, ఒక వేళ అధికారంలోకి వచ్చి ఉంటే  ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టేవారందరికీ తానే సంధానకర్తను అని చెప్పుకునేవారని  విమర్శించారు. 

చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ లో తలపండినవారని సెటైర్లు వేశారు. అమరావతిలో గాయపడిన వారందరినీ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించేవారని చెప్పుకొచ్చారు. 80 లక్షల మంది డ్వాక్రా మహిళల ఉత్పత్తులను వాల్‌మార్ట్, ఐటీసీ, మహీంద్రా, ఫ్యూచర్‌ గ్రుప్‌ వంటి కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేస్తాయని చంద్రబాబు గతంలో చెప్పారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. 

అందులో భాగంగా గతంలో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే ఆ కంపెనీలు కొనుగోలు చేస్తున్న వస్తువులు ఏమిటో చంద్రబాబు, ఆయన అనుచరులు సమాధానం చెప్పాలని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శించారు.