అమరావతి: తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. వరద నీటిలో మునిగిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరిస్తే హత్యకు కుట్ర పన్నినట్టా అంటూ ప్రశ్నించారు. డ్రోన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అనవసర రాద్దాంతం చేస్తోందంటూ మండిపడ్డారు. 

ఇకపోతే పరువు గంగ పాలవుతుందని బ్యారేజి గేట్లు తెరవక ముందే సారు హైదరాబాద్ పారిపోయారంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. విలులైన వస్తువులన్నీ తరలించారని, కృష్ణానది కావాలనే ప్రవాహాన్ని పెంచుకుంటోందని నిందించేట్టున్నారు చివరకు అంటూ పంచ్ లు వేశారు. 

మరోవైపు ఎల్లోమీడియాపైనా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బీజేపీని వదిలి పెట్టాక కుల మీడియా ఆ పార్టీని ఒక విలన్‌గా చిత్రీకరించిందని ఆరోపించారు. మొన్నటి వరకు ప్రధాని మోదీని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేసిందని విమర్శించారు.  

పచ్చ పార్టీ నాయకులంతా బీజేపీలోకి దూకుతుండటంతో ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చి పడిందన్నారు. రివర్స్ గేర్ వేయక తప్పడం లేదంటూ ట్వీట్ చేశారు. గతంలో వరదలు, తుఫాన్లు వస్తే చంద్రబాబు వన్ మ్యాన్ షో నడిచేదని చెప్పుకొచ్చారు.

సహాయకచర్యల్లో కలెక్టర్లపై ఆగ్రహం, సీఎం వచ్చేదాకా కదలని అధికార గణం అంటూ కుల మీడియా ఆయనను ఆకాశానికెత్తేదని విమర్శించారు. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. తిట్లు, సస్పెన్షన్లు లేవు అంటూ  చంద్రబాబుపై సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి.