న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని అభిప్రాయప్డడారు. 

ఆంధ్రప్రదేశ్ కు సాయం చేస్తామని ఇచ్చిన హామీని కేంద్రప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు, అమరావతి రాజధానిల ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అదనంగా ఇచ్చింది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

మరోవైపు కార్మికులకు పెన్షన్ల ఇచ్చే నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడం మంచిదేనన్నారు. అయితే ఎయిరిండియాను ప్రైవేటీకరించడం సరికాదని చెప్పారు. పారిశ్రామికరంగానికి ఏం చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదని విజయసాయిరెడ్డి  వ్యాఖ్యానించారు.