అమరావతి: వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా ప్రైవేట్ పాఠశాలల నుండి భారీగా విద్యార్థులు చేరుతున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు కార్పోరేట్ పాఠశాలల పక్షాన నిలిస్తే తమ ప్రభుత్వం నిరుపేద ప్రజల పక్షాన నిలిచిందని విజయసాయి పేర్కొన్నారు. 

''ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇంత డిమాండ్ లేదు. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.  గత ప్రభుత్వ కార్పోరేట్ పాఠశాలల లబ్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటే... గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్రజల పక్షాన నిలిచి వారికోసం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు'' అని విజయసాయి ట్వీట్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు–నేడు కోసం కేటాయించిన నిధులపై  సీఎం వైస్ జగన్ ఇటీవలే సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న దీని విషయంలో ఎక్కడా నిధులకు కొరత రాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. నిధుల అనుసంధానంపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను పెట్టుకుని ఖచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకేయాలని స్పష్టం చేశారు. 

read more   ఏపీలో మారనున్న ప్రభుత్వ బడుల రూపురేఖలు... ఇకపై ఇలా వుంటాయట...

ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్దేశించిన వివిధ శాఖల్లో చేపట్టిన కార్యక్రమాల పురోగతి, వాటికి చేస్తున్న ఖర్చు, సమీకరించాల్సిన నిధులు విషయమై సీఎం జగన్ అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించడానికి చేపడుతున్న నాడు-నేడుపై ప్రత్యేక శ్రద్ద చూపించి అవాంతరాలు లేకుండా చూడాలని అధికారులకు సీఎం సూచించారు.