అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన వంతు విరాళం అందజేశారు.

అయోధ్య రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా తన మూడు నెలల వేతనాన్ని (రూ.3.9లక్షలు) విరాళంగా ఇచ్చినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. ఈ రోజు భక్తులతో కలిసి రూ.1,11,111లు అందజేసినట్టు తెలిపారు.

వందల ఏళ్ల నాటి ఈ కలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ తమ స్తోమతకు తగ్గట్లుగా విరాళం ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మొత్తం రూ.1,100 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ గతంలో పేర్కొంది. ఇందులో ప్రధాన ఆలయ నిర్మాణానికి రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే ఆన్ లైన్ విరాళాల ద్వారా రూ.100 కోట్లకు పైగా సమకూరాయని ట్రస్ట్ తెలిపింది. తాజాగా, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాల సేకరణను ప్రారంభించారు. అన్ని వర్గాల వారి నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు.