తెలుగు రాష్ట్రాల్లో పాస్‌పోర్ట్ జారీలో ఆలస్యం జరుగుతోందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఫిర్యాదు చేశారు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్. దీనికి సంబంధించి ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పాస్ పోర్టుల జారీలో (passport issue) తీవ్ర జాప్యం జరుగుతోందని వివరిస్తూ వైసీపీ యువ నేత, రాజమహేంద్రవరం ఎంపీ (rajahmundry mp) మార్గాని భరత్ రామ్ (margani bharat ram) మంగళవారం విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌కు (s jai shankar) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా విదేశాంగ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టుల జారీలో జాప్యానికి అసలు కారణాలను కూడా భరత్ రామ్ ప్రస్తావించారు.
తత్కాల్ పథకం కింద కేవలం 3 రోజుల్లో పాస్‌పోర్టులు జారీ కావాల్సి ఉందని, అదే సాధారణ పద్ధతుల్లో 15 రోజుల్లో పాస్‌పోర్టులు జారీ కావాల్సి ఉందని భరత్ రామ్ స్పష్టం చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా పాస్‌పోర్టుల జారీలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్న మాట వాస్తవంగా, విరుద్ధంగా ఉందని భరత్ అన్నారు. పాస్‌పోర్టుల జారీలో జాప్యానికి సిబ్బంది కొరతే ప్రధాన కారణమని కూడా భరత్ రామ్ తెలిపారు. ఈ వ్యవహారంపై విదేశాంగ శాఖ దృష్టి సారించాలని, తక్షణమే సమస్యను పరిష్కరించే దిశగా సిబ్బందిని పెంచాలని ఆయన జైశంకర్‌ను కోరారు.
