విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓటమిని ఒప్పుకోక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్సీ, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి. ఎన్నికల ఫలితాలు రాకముందు నుంచే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు.

గురువారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కోలగట్ల ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికల సం‍ఘంపై నిందలు వేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఈసీపై బెదిరింపులు బెడిసికొట్టడంతో ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తున్నారని మండిపిడ్డారు. 

ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలకు ఈసీపై తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, వాటిని హుందాగా స్వీకరించాలే తప్ప వ్యవస్థలను తప్పుపట్టకూడదని హితవు పలికారు. 

సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ గుర్తుకు వెళ్లిపోతుందని అనుమానం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు మరి టీడీపీకి 130 సీట్లు వస్తాయని ఎలా చెప్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రిజల్ట్స్ అనంతరం చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని విమర్శించారు. 

కేసులకు భయపడే చంద్రబాబు కేంద్రంలో వివిధ పార్టీలతో కలుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలు గుర్తుంచుకునే తీర్పునిచ్చారని చెప్పుకొచ్చారు. తాను చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకే చంద్రబాబు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారంటూ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు.