వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ‌లో (ysr congress party) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా (Mohammed Karimunnisa) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ‌లో (ysr congress party) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా (Mohammed Karimunnisa) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల హాజరైన కరీమున్నీసా.. సాయంత్రం విజయవాడలోని ఇంటికి చేరుకున్నారు. అయితే రాత్రి సమయంలో కరీమున్నీసా.. అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. 

కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. కరీమున్నీసా తొలుత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ స్థాపించినప్పటీ నుంచి జగన్ వెంటే ఉన్నారు. వైసీపీ పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. గతంలో విజయవాడ 54వ వార్డు కార్పొరేటర్‌గా పనిచేశారు. ఆమెకు ముస్లిం మైనార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (cm ys jagan) ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ ఏడాది మార్చిలోనే ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దరఖాస్తు చేసుకోకపోయినా సీఎం జగన్ పిలిచి అవకాశం ఇచ్చారని కరీమున్నీసా.. ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 

కరీమున్నీసా మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆమె మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా కరీమున్నీసా హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న ఉదయం శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురి కావడం, గుండె పోటుతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

‘నా సోద‌రి మహ్మ‌ద్ క‌రీమున్నీసా ఆక‌స్మిక మ‌ర‌ణం న‌న్ను తీవ్రంగా క‌ల‌చివేసింది. నిన్న శాస‌న‌మండ‌లికి హాజ‌రై రాత్రి అక‌స్మాత్తుగా గుండెపోటుకు గురై మ‌ర‌ణించ‌డం చాలా బాధాక‌రం. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నా. వారికి నాతో స‌హా పార్టీ అండ‌గా ఉంటుంది’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.