విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర నెలలు పూర్తి చేసుకుంది. ఇంకా పాలనను గాడిలోకి రాని పరిస్థితి. తాను చంద్రబాబు నాయుడిలా కాదని తనకు మూడేళ్లు సమయం ఇస్తే తానేంటో నిరూపిస్తానని సీఎం జగన్ పదేపదే ప్రజలను సమయం అడుగుతున్నారు.  

అవినీతి రహిత పాలన కోసం ఏం చేయాలో అని సీఎం జగన్ తలలు పట్టుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీలో ఆధిపత్యపోరు పార్టీ పాలిట శాపంగా మారింది. అంతు చూస్తామని ఒకరు, తనను తొక్కేస్తానని మరోకరు ఇలా ఒక్కో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో జరుగుతున్న అసమ్మతిని వెళ్లగక్కుతున్నారు. 

ఇప్పటికే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తనను ఇబ్బందిపాల్జేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రజని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 

నాలుగు నెలల క్రితమే గెలుపు రుచి చూసినా ఏరోజు ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లనైన తాను నాలుగువైపుల నుంచి శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తుందంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చారు. 

 

నా అనుకున్న వాళ్లు సైతం తనను అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రతీ అంశంలో తనను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారని కార్యకర్తలకు వివరించారు. అందరి అండదండలతో ముందుకు వెళ్లాలని తాను భావిస్తుంటే తన వెంటే ఉంటూ తనకు వెన్నుపోటు పొడవాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. 

అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని వారి అంతు చూస్తానని హెచ్చరించారు విడదల రజనీ. ఈమె చేసిన వ్యాఖ్యలు చిలకలూరి  పేటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. 

విడదల రజనీ ఆవేదన ఇలా ఉంటే విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సైతం తన ఆవేదన వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాబూరావు దళితుడుననే కారణంతో తనను తొక్కేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. 

పార్టీలోనే కొందరు నేతలు తన ఎదుగుదలను తొక్కేస్తున్నారని విమర్శించారు. దళితుడుననే అక్కసుతో హేళన చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన సొంత పార్టీకి చెందిన నేతలే తనను వేధించడాన్ని తట్టుకోలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

పాయకరావుపేట నియోజకవర్గం నుంచి తాను మూడుసార్లు గెలిచినా దళితుడనే కారణంతో తనను అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు నియోజకవర్గం అభివృద్ధిలో సైతం తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లు పైబడుతున్నా ఇప్పటికీ దేశంలో దళితులపట్ల కుల వివక్ష, అంటరానితనం రూపుమాపలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమం అయినా, పార్టీ కార్యక్రమాలైనా ఏ కార్యక్రమం జరిగినా తన ఫోటో అత్యంత చిన్నదిగా ఇతరులది పెద్దదిగా వేసుకుని మరీ తనకు ప్రచారం లేకుండా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆరోపించారు. 

వైసీపీలో సీనియర్ నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొల్ల బాబూరావు ఆవేదనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏపీ ప్రభుత్వ పాలనపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల సాధన కోసం ఆయన పరితపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీని మింగుడుపడ నివ్వడం లేదు. అయితే సీఎం జగన్ ఈ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.