మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాాజీనామాతో అధికార వైసిపిలో అలజడి రేగింది. ఈ క్రమంలో మరో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా రాజీనామా చేసారంటూ ప్రచారం మొదలయ్యింది. దీనిపై వసంత క్లారిటీ ఇచ్చారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది... కానీ ఇప్పటినుండే ప్రధాన పార్టీలు గెలుపు కోసం ప్రణాళికలు సిద్దంచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే అధికార వైసిపి పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జీలుగా కొత్తవారిని నియమించింది. చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే వున్న మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇంచార్జీకి అప్పగించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. దీంతో ఒక్కసారిగా అధికార పార్టీలో అలజడి రేగింది. 

అయితే ఆళ్ల బాటలోనే మరికొందరు వైసిపి ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్దమయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు వసంత క‌‌ృష్ణ ప్రసాద్ ది. మైలవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కృష్ణప్రసాద్ కూడా వైసిపిని వీడనున్నారని... ఇప్పటికే రాజీనామాకు కూడా సిద్దం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.చివరకు ఈ ప్రచారం వైసిపి పెద్దలవరకు వరకు చేరింది. దీంతో తన రాజీనామాపై జరుగుతున్న ప్రచారంపై స్వయంగా వసంత కృష్ణప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. 

కొందరు కావాలనే తనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని... తాను రాజీనామా చేసినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేసారు. రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించేందుకే ఈ రాజీనామా ప్రచారం ప్రారంభించారని... దీన్ని తిప్పికొట్టాలని వైసిపి శ్రేణులకు వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.

Also Read అభ్యర్థులను కాదు వైఎస్ జగన్ నూ మార్చాల్సిందే..!: టిడిపి నేతలు

మంత్రి జోగి రమేష్ స్వస్ధలం మైలవరమే. 2014 లో ఆయన ఈ నియోజకవర్గం నుండే పోటీ చేసారు. కానీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో 2019 లో ఆయన పెడన నుండి పోటీచేసి గెలిచారు. పార్టీ ఆదేశాలతోనే ఆయన పెడనకు మారాల్సి వచ్చింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు కాకుండా తన వర్గీయులకు ఇప్పించుకోవాలని మంత్రి ప్రయత్నిస్తున్నారట. ఇందులోభాగంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానిక వైసిపి నాయకులతో ఓ గ్రూప్ ఏర్పడింది. 

వైసిపి పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపై వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తితో వున్నారని... అందువల్లే రాజీనామాకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. కానీ తనకు రాజీనామా ఆలోచన లేదని... వైసిపి లోనే కొనసాగుతానని వసంత కృష్ణప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.