చంద్రబాబు నాయుడు బాబ్లీ కేసులోంచి బైటపడేందుకే మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు టిటిడి బోర్డులో స్థానం కల్పించారని వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి  ఆరోపించారు. తనపై కేసులు పెట్టిన మహారాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి భార్యకు టిటిడిలో స్థానం కల్పించడంలో అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఇంత జరుగుతున్నా ఆ మంత్రి భార్యను ఎందుకు సస్పెండ్ చేయడం లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఏపి సీఎం చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం దేన్నయినా వాడుకోగలరని...ఇప్పుడు కోర్టు నోటీసులను కూడా అందుకోసం వాడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.  చంద్రబాబును ఓ పబ్లిసిటీ పిచ్చోడిగా అభివర్ణించారు. సొంత జిల్లాకే కాదు రాష్ట్రంలోని ఏ జిల్లాకు చంద్రబాబు సాగునీరు అందించలేదన్నారు. రాష్ట్రంలోని ఏ జిల్లా ప్రజలతోనైనా ఆయన రైతు భాందవుడు అని పిలిపించుకోగలరా అని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. 

నీటిపారుదల మంత్రి దేవినేని ఉమపై కూడా శ్రీకాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాయలసీమకు సాగునీరందించే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోడానికి ఉమ  ప్రయత్నించారని ఆరోపించారు. అందుకోసం ధర్నాలు కూడా చేపట్టారని తెలిపారు. ఇప్పుడే ఆయనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని  శ్రీకాంత్ రెడ్డి అన్నారు.