Asianet News TeluguAsianet News Telugu

దొంగ దీక్షలకు అభినందలా... టిడిపి తీర్మానమంతా సెల్ఫ్ డబ్బానే: వైసిపి ఎమ్మెల్యేలు

టిడిపి జనరల్ బాడీ మీటింగ్ లో  తెలుగుదేశం పార్టీ చేసిన తీర్మానాలపై వైసిపి ఎమ్మెల్యేలు  మండిపడ్డారు. 

YSRCP  MLA's criticise  TDP Generalbody Resolution
Author
Amaravathi, First Published Apr 29, 2020, 9:03 PM IST

అమరావతి: దొంగ దీక్షలు చేసి తమను తామే అభినందించుకునే దుస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటై వైసిపి ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, టీజేఆర్ సుధాకర్ బాబు,  
జోగి రమేష్ లు మండిపడ్డారు. ఆన్ లైన్ లో టీడీపీ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానాలు... అంటూ ఈరోజు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారని... అందులో తమ నాయకులకు దీక్షలు చేసినందుకు అభినందనలు తెలిపారన్నారు. ఇవన్నీ దిగజారుడు తీర్మానాలేనని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. 

అయితే అభినందించే పనులు గత నెల రోజులుగా ఏం చేశారంటే.. దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ చివరికి దొంగ దీక్షలను తమకు తామే అభినందించుకునే దుస్థితికి వచ్చిందని ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంట్లో కూర్చొని రాసిన లేఖలు వల్లే కొన్ని మేళ్ళు జరిగాయంటూ.. బాబు భజన చేయటం కోసమే ఈ సమావేశం పెట్టారన్నారు. 

''అధికారం పోయినా.. భజన చేయించుకోవాలనే యావ బాబుకు ఏమాత్రం తగ్గలేదు. రిటైర్డ్  ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తనకు తానే నిర్ణయం తీసుకుని పూర్తి పెన్షన్ చెల్లిస్తామని చెబితే.. తన లేఖ వల్లే అంతా అయిందంటున్నాడు. ఎవరి పిచ్చి వారికి ఆనందం'' అని విమర్శించారు. 

'' పొగాకు కొనుగోళ్ళు ప్రారంభించాలన్నది ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేకపోయినా జగన్ ప్రభుత్వం ముందుకు వచ్చి తమకు తామే కొనుగోళ్ళు ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. దీనికీ, చంద్రబాబుకి ఏమిటి సంబంధం?'' అని వైసిపి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. 

''గుజరాత్ నుంచి మత్స్యకారుల్ని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, చంద్రబాబుకు ఏమిటి సంబంధం? ఈ పనులన్నీ నేనే చేశానని, నా వల్లే జరిగాయని చెప్పటమే కాకుండా.. టీడీపీ అంతర్గత జనరల్ బాడీ సమావేశంలో తనకు అభినందన తీర్మానం చేయాలని చెప్పి చేయించుకున్న చంద్రబాబును చూసి జాలిపడాలో.. తన ప్రచార పిచ్చిని చూసి ఇక మారడని మరోసారి అనుకోవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'' అని అన్నారు. 

''చంద్రబాబు ఇల్లు కదలడు. ఈయన కొడుకు వీధిలో సైకిల్ తొక్కడం వరకు మాత్రమే బయటకు వస్తాడు. ఇక్కడ ఏపీలో అధికారులు బయటకు వస్తే.. వాలంటీర్లు బయటకు వస్తే.. ఉద్యోగులు బయటకు వస్తే.. వారివల్ల కూడా కరోనా వ్యాపించిందంటాడు.  తాను ఏనాడూ జీవితంలో చేయని పనుల్నిఇప్పుడు ప్రభుత్వం చేయాలంటాడు. పంటలన్నింటినీ ప్రభుత్వమే కొనాలంటాడు. ఆహారం అందక రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని.. వారికి కూడా సాయం అందించాలని బయటకు వచ్చిన వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తప్పుపడతాడు. -వారి వల్లే కరోనా వ్యాపించిందంటాడు''  అంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. 

''హైదరాబాద్ లో హెరిటేజ్ ఉద్యోగులకు కరోనా వ్యాపించడానికి కారణం ఎవరంటే.. సమాధానం చెప్పడు.  కరోనా లేని రోజుల్లోనే దాదాపు లక్షా 60 వేల కోట్లు అప్పు తెచ్చిన రోజుల్లోనే.. రాష్ట్ర ఖజానాకు ఎలాంటి కోతలు లేకుండా ఆదాయం వచ్చిన రోజుల్లోనే.. తాను వ్యవసాయ రంగానికి, మహిళలకు, పేదలకు ఏమీ చేయని వ్యక్తి ఇప్పుడు నెలకు రూ.5 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఏ ఒక్క రూపాయి రాకపోయినా.. రోజుకో ఉత్తరం రాస్తూ.. వారందరికీ సాయం చేయండి అంటూ దీన్నో ఇరికించే కార్యక్రమం కింద చూస్తూ పిచ్చి ఆనందం పొందుతున్నాడు''  అని అన్నారు. 

''ఈరోజు టీడీపీ జనరల్  బాడీ తీర్మానం పేరిట విడుదల చేసిన పత్రంలో కూడా ప్రభుత్వానికి, కరోనాపై ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా చేస్తోన్నపోరాటానికి భేషరతుగా మద్దతు పలుకుతున్నాం.. అన్న ఒక్క వాక్యం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుద్దాం.. అన్న ఒక వాక్యం కూడా లేదు. - కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆదాయంలో లోటు మేరకు పూడ్చవలిసిందిగా ఒత్తిడి తెద్దాం.. అన్న ఆలోచన కూడా లేదు'' అని అన్నారు. 

''ఒక అసాధారణ వాతావరణం ఇది. మనిషికి, కంటికి కనిపించని వైరస్ కు మధ్య జరుగుతోన్న ఈ యుద్ధంలో మనుషులుగా గెలిచే వరకు రాజకీయాలు పక్కన పెడదాం అన్న ఆలోచన కూడా లేదు.   ఇవన్నీ లేకుండా అన్ని వర్గాల కోసం డిమాండ్ చేస్తున్నట్లు డ్రామా ఆడితే.. దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం?'' అని వైసిపి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios