అమరావతి: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరికాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ కానున్నారు.

జగన్  మంత్రివర్గంలో  రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు చోటు దక్కలేదు .కేబినెట్‌లో ఏ కారణాలతో చోటు కల్పించలేకపోయారో  జగన్‌ రెండు దఫాలు రోజాకు వివరించారు.. విజయసాయిరెడ్డి కూడ ఆమెతో ఫోన్‌లో చర్చించారు..

 మంత్రివర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం రోజున అందుబాటులో ఉండాలని రోజాకు వైఎస్ జగన్ సూచించారు.  అయితే మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరుకాలేదు.

ఏపీ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ పదవిని రోజాకు కట్టబెట్టాలని  జగన్ భావిస్తున్నారు. ఇదే విషయమై రోజాతో వైసీపీ నాయకులు చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు ఈ పదవిని కట్టబెడితే ఏమైనా న్యాయ పరమైన ఇబ్బందులు ఏర్పడుతాయా అనే విషయమై రెండు రోజులుగా వైసీపీ నేతలు చర్చిస్తున్నారు.

సోమవారం రాత్రి జగన్ రోజాకు ఫోన్ చేసి మంగళవారం నాడు తనను కలవాలని కోరారు. ఈ మేరకు  రోజా మంగళవారం నాడు మధ్యాహ్నం జగన్‌ను కలిసేందుకు ఏపీకి బయలుదేరి వెళ్లారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువగా ఇబ్బంది పడింది రోజా. తన కంటే ఎక్కువగా ఇబ్బంది పడిన నేతలు ఎవరు ఉన్నారని రోజా ప్రశ్నించినట్టుగా సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో  రోజాకు జగన్ ను కలవాలని ఫోన్ వచ్చింది. రెండున్నర ఏళ్ల తర్వాత రోజాకు  మంత్రివర్గంలో చోటు కల్పించే విషయమై హామీ ఇవ్వనున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

మరోవైపు మంగళగిరి నుండి రెండో దఫా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడ జగన్‌ను కలవాలని వైసీపీ నేతలు ఫోన్ చేశారు. మంగళగిరిలో లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కుతోందని భావించారు. కానీ ఆయనకు మంత్రి పదవి రాలేదు.

రెడ్డి సామాజిక వర్గానికి జగన్ తన కేబినెట్ లో నలుగురికి మాత్రమే చోటు కల్పించారు. సామాజిక సమతుల్యతను పాటించే ఉద్దేశ్యంతో రెడ్డి సామాజిక వర్గానికి తక్కువగా కేబినెట్ లో చోటు కల్పించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని బుజ్జగించేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే జగన్ ను కలవాలని ఫోన్ చేశారు. రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు జగన్ తో భేటీ కానున్నారు.