అంతర్వేదిలో రథం తగలబడిన  సంఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా. గతంలో రైలు దహనం, రాజధాని భూములు తగలు బెట్టించిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.

సీబీఐ రాష్టానికి రావద్దని జీవో ఇచ్చిన చంద్రబాబు నేడు సీబీఐ విచారణ కోరుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. తమ చిత్తశుద్ది నిరూపించుకునేందుకు జగన్ సీబీఐ విచారణకు ఆదేశించారని రోజా అన్నారు.

తాడేపల్లిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా ద్వారా జగన్ హామీ నిలబెట్టుకున్నారని రోజా ప్రశంసించారు. మహిళలు కోసం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారని కొనియాడారు.

90 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా మేలు జరిగిందని ఆమె గుర్తుచేశారు. జగన్ మహిళల పక్షపాతని.. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రోజా తెలిపారు.

చంద్రబాబులాగా కుంటి సాకులు చెప్పడం జగన్‌కు తెలియదని.. మహిళలు, విద్యార్థులు కోసం సీఎం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని ఆమె గుర్తుచేశారు. మహిళకు ఇచ్చే ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారని రోజా ఆరోపించారు.

రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారని.. కానీ ప్రజలను తమ సొంత కుటుంబ సభ్యులుగా జగన్ భావిస్తున్నారని ఆమె తెలిపారు. దళిత మహిళను హోమ్ మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని రోజా ప్రశసించారు.

నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళకు అవకాశం కల్పించారని... మహిళల ఆకాంక్ష మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారిగా సీఎం జగన్ ఎత్తివేస్తున్నారని నగరి ఎమ్మెల్యే అన్నారు. మహిళలు కోసం చంద్రబాబు ఒక మంచి పథకం కూడా ప్రవేశ పెట్టలేదని... వైఎస్సార్ ఆసరా మీద చంద్రబాబు నిందలు వేస్తున్నారు రోజా ధ్వజమెత్తారు.