చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆమె రూటే సెపరేటు. ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడగలడంలో ఆమెకు ఆమె సాటి. అందుకే ఆమెను ఏపీ ఫైర్ బ్రాండ్ అంటూ పిలుస్తారు. 

రాజకీయాల్లో ప్రత్యర్థులను ఢీ కొట్టడంతోపాటు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో దిట్ట అంటూ ఏపీ రాజకీయాల్లో ప్రచారం. రాజకీయాల్లో ఆమె ఎంతలా గంభీరంగా మాట్లాడతారో ఆమె చేసే సేవా కార్యక్రమాలు కూడా అంతే ఆహ్వానించదగినవిగా ఉంటాయంటున్నారు వైసీపీ అభిమానులు. 

ఆమె నగరి ఎమ్మెల్యే రోజా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైయస్ఆర్ క్యాంటీన్ పేరుతో రూ.5కే భోజనం అందించారు. రెండు రూపాయిలకే 20 లీటర్ల తాగునీటిని అందించారు. ఇలా ఎన్నెన్నో సేవాకార్యక్రమాలు చేపట్టిన రోజా తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో తన వంతు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. 

నగరి రూరల్ మండలం దామరపాకంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను అందజేశారు. ఆ పుస్తకాలను ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. 

విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించే సాయమే తనకు నిజమైన సన్మానమని ఆమె చెప్పుకొచ్చారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం గ్రామాలకు వచ్చినప్పుడు తనను అభినందించడానికి వచ్చేవారు శాలువలు, పూలదండలు తీసుకురావద్దని సూచించారు. 

ఆ ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు ఇచ్చే విద్యాసామగ్రి  పేద విద్యార్థుల చదువులకు ఎంతో ఉపయోగపడుతుందని రోజా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రోజా పిలుపుపై అక్కడి ప్రజలు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.