పుంగనూరు ఘర్షణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బూతులు తిడుతున్నారని, ఇది ఆయన నైజమని నల్లపరెడ్డి ఎద్దేవా చేశారు. 

పుంగనూరు ఘర్షణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పుంగనూరులో చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు సంబంధించిన వాహనాల్లో రాళ్లు, రాడ్లు, కర్రలు, బీర్ బాటిళ్లు, గన్స్ వున్నాయని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పక్కా ప్లాన్‌తో గొడవలు చేయించి దానిని వైసీపీకి పులిమి లబ్ధి పొందాలని చూశారని ఆయన ఫైర్ అయ్యారు. 

పరిటాల రవి హత్య సమయంలో తాను టీడీపీ ఒంగోలు ఇన్‌ఛార్జ్‌గా వున్న విషయాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ సమయంలో కరణం బలరామ్‌కు, తనకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి బస్సులు తగులబెట్టండి, విధ్వంసం చేయండి, షాపులను ధ్వంసం చేయమని చెప్పారని నల్లపరెడ్డి అన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు కలిగిన వ్యక్తి అని ఆయనో పెద్ద రౌడీ అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో పోలీసులపై దాడులు చేశారని.. దీని వెనుక చంద్రబాబు హస్తం వుందని ఆయన ఆరోపించారు. ఇలాంటి పనులు చేసేది చంద్రబాబేనని.. దానికి తాను, కరణం బలరామ్ సాక్ష్యులమని నల్లపరెడ్డి పేర్కొన్నారు. 

ALso Read: చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న టెన్షన్.. చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్దం.. పోలీసులకు మంత్రి పెద్దిరెడ్డి పరామర్శ

కందుకూరులో చంద్రబాబు సభకు వచ్చి తొక్కిసలాట జరిగి వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారని .. వారికి ఆర్ధిక సాయం చేస్తానని, ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాలను, రాజకీయాలుగా చూడాలని.. ఇలాంటి పనులు చేసి లబ్ధి పొంది అధికారంలోకి రావాలనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధులు మార్చుకోవాలన్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌లు ఎంతమంది వచ్చినా జగన్‌ను టచ్ చేయలేరని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బూతులు తిడుతున్నారని, ఇది ఆయన నైజమని నల్లపరెడ్డి ఎద్దేవా చేశారు.