వైసిపి ప్రభుత్వంలో టిడిపి నాయకులకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే పార్థసారధి నిరూపించారు. 

ఉయ్యూరు: పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వైసిపి నాయకులు చెబుతుంటారు. కానీ వైసిపి నాయకులకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని టిడిపి వాళ్లు ఆరోపిస్తుంటారు. దీంతో ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయని నిరూపించాలని అనుకున్నాడో ఏమోగానీ మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే పార్థసారధి టిడిపి కౌన్సిలర్ కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి బయటపెట్టాడు. 

కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో ఎమ్మెల్యే పార్థసారధి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని 20వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ వైసిపి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇలా స్థానిక టిడిపి మహిళా కౌన్సిలర్ ఇంటికి కూడా వెళ్లాడు ఎమ్మెల్యే. ఈ క్రమంలో కౌన్సిలర్ భర్త పండ్రజు చిరంజీవి, పార్థసారధి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 

వీడియో

వైసిపి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా కౌన్సిలర్ కుటుంబానికి జరిగిన లబ్ది గురించి వివరించారు ఎమ్మెల్యే పార్థసారధి. ఏయే పథకాల ద్వారా ఎంత డబ్బు కౌన్సిలర్ కుటుంబానికి వచ్చిందో ఎమ్మెల్యే చెబుతుంటే కౌన్సిలర్ భర్త అవునని సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, కౌన్సిలర్ భర్తకు మధ్య సరదా సంబాషణ సాగింది.