టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్, దేవుడు కలిసి స్క్రిప్ట్ రాశారని.. నారా లోకేష్‌కు ఎమ్మెల్సీగా ఆఖరి రోజు ఇదేనంటూ దుయ్యబట్టారు. టీడీపీ ఆవిర్భావం రోజున తండ్రీ కొడుకులు కుళ్లికుళ్లి ఏడుస్తున్నారని నాని అన్నారు. 

ఎన్టీఆర్‌పై , ఆయన విధానాలపై ఎలాంటి వివాదాలు లేవన్నారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేటికీ ఎన్టీఆర్ పేరును ప్రజలు, పార్టీలు స్మరిస్తూనే వున్నాయన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం, పేదవాడికి పక్కా ఇళ్లు వంటి కార్యక్రమాలను చంద్రబాబు రద్దు చేశారని మండిపడ్డారు. 

ఎన్టీఆర్‌పై ఎందుకు చెప్పులు వేయించావని కొడాలి నాని ప్రశ్నించారు. పేదల పార్టీని పెత్తందారుల చేతిలో పెట్టడమే కాకుండా రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ , ఎంపీ టికెట్లను చంద్రబాబు అమ్ముకున్నారని ఆరోపించారు. టీడీపీని ఒక వ్యాపార సంస్థగా మార్చి చంద్రబాబు కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పెట్టిన కార్యక్రమాలను చంద్రబాబు ఏం కొనసాగించారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్, దేవుడు కలిసి స్క్రిప్ట్ రాశారని.. నారా లోకేష్‌కు ఎమ్మెల్సీగా ఆఖరి రోజు ఇదేనంటూ దుయ్యబట్టారు. 

పార్టీ పుట్టినరోజున అందరినీ పండుగ చేసుకోమని.. నువ్వు, నీ కొడుకు కుళ్లి కుళ్లి ఏడుస్తున్నారని నాని ఎద్దేవా చేశారు. వైఎస్ అంటే ఆరోగ్య శ్రీ, 108లు గుర్తొస్తాయని.. చంద్రబాబు అంటే వెన్నుపోటు గుర్తొస్తుందని నాని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ స్థాయిలో రాజకీయాల్లో నిలబడిన వ్యక్తి వైఎస్ అని కొడాలి నాని ప్రశ్నించారు. మీకు అవసరమైతే ఎన్టీఆర్‌ను దేవుడు అంటావ్, లేదంటే దుర్మార్గుడని ముద్రవేస్తావ్ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని కూకటివేళ్లతో పెకిలించిన వ్యక్తి వైఎస్సార్ అని కొడాలి నాని గుర్తుచేశారు.