తాడోపేడో తేల్చుకుందామంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి నోటి వెంట కొట్టుకుందాం, చూసుకుందాం అన్న మాటలు రావడం ఏంటని ప్రశ్నించారు.

కృష్ణా జిల్లా గన్నవరం పర్యటన సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి నోటి వెంట కొట్టుకుందాం, చూసుకుందాం అన్న మాటలు రావడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా ప్రతిపక్షనేత, సీఎం .. సెక్యూరిటీని పక్కనబెట్టి కొట్టుకుంటారా అని నాని నిలదీశారు. చంద్రబాబును పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని ఆయన చురకలంటించారు. నారా లోకేష్ తన పిచ్చి వాగుడును తండ్రికి కూడా అంటించారని ఆయన దుయ్యబట్టారు. 

జగన్ రాజ్యాంగాన్ని , ప్రజలను నమ్ముకున్నారని.. అందువల్ల ఆయన కొట్టుకోవడానికి రాడని కొడాలి నాని అన్నారు. తాను , వంశీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని.. చంద్రబాబు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కమాండోలను వెనక్కి పంపి రావాలని కొడాలి నాని సవాల్ విసిరారు. నల్లమల ఫారెస్ట్‌లోనో, బందరు సముద్రంలోనో కొట్టుకుందామని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు బాలయ్య పూనినట్లుగా వున్నారని.. అందుకే సినిమా డైలాగ్స్ పేలుస్తున్నారంటూ కొడాలి నాని సెటైర్లు వేశారు. 

ALso REad: పోలీసులు కొట్టలేదు.. పట్టాభి చెప్పినదంతా అబద్ధమే, మా వాళ్లపై నిందలొద్దు : కృష్ణా జిల్లా ఎస్పీ

అంతకుముందు సోమవారం వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్రణాళిక ప్రకారమే గన్నవరంలోని తమ కార్యాలయంపై దాడులు జరిగాయని ఆరోపించారు. కొంతమంది పోలీసుల వల్లే సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తనను పర్యటించొద్దు అనడానికి పోలీసులు ఎవరు.. బెదిరిస్తే పారిపోతామా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ను నమ్ముకున్న ఎందరో అధికారులు జైలుకు వెళ్లారని.. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. దొంగలాటలు వద్దు.. లగ్నం పెట్టుకుందాం, తాడోపేడో తేల్చుకుందామని, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా జగన్ రావాలని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా.. కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘర్షణల కేసులో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిడిపి కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలిసి పట్టాభి అక్కడి వెళ్లారు. ఈ క్రమంలోనే దాడి సమయంలో పోలీసుల తీరును నిరసిస్తూ డిజిపి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పట్టాభితో పాటు మరికొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టాభిని ఎక్కడికి తరలించారో తెలియకపోవడంతో మంగళవారం గందరగోళం నెలకొంది. పట్టాభికి ప్రాణహాని వుందంటూ ఆయన భార్య ఆందోళనకు దింగింది. ఈ క్రమంలో సాయంత్రం గన్నవరం కోర్టులో పట్టాభిని హాజరుపర్చగా తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు న్యాయమూర్తికి తెలిపారు.