ఆనందయ్య మందు విషయంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి. సోమిరెడ్డి దిగజారిపోయి మాట్లాడుతున్నాడని.. సోమిరెడ్డికి సిగ్గు, శరం ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీలాగా దోచుకునే బతుకు మాది కాదని.. నీ దగ్గర నీతులు చెప్పించుకునే స్థాయికి దిగజారమని కాకాని వ్యాఖ్యానించారు.

ఇప్పటికి నాలుగుసార్లు ఓడిపోయావు అయినా నీకు సిగ్గు శరం రాలేదని.. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా 2024 లో తేల్చుకుందామని గోవర్థన్ రెడ్డి సవాల్ విసిరారు. శ్రీనివాస మహల్ ఎదురుగా నువ్వు ఏం చేసేవాడివో గత చరిత్రలో చూసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ఉఫ్ అంటే ఎగిరిపోయే వాడివి నువ్వు అంటూ కాకాని మండిపడ్డారు. పేకాట ఆడి అందరికీ అప్పులు అయిపోయిన ఘనత  సోమిరెడ్డిదని.. ఒళ్ళు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని గోవర్థన్ రెడ్డి హితవు పలికారు.

Also Read:ఆయుర్వేద మందుపై రచ్చ.. కాకానికి ఆనందయ్య బాసట, సోమిరెడ్డిపై విమర్శలు

నువ్వు నీ కొడుకు సర్వేపల్లి నియోజకవర్గంలో అడ్డంగా దొరికిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసునంటూ కాకాని గుర్తుచేశారు. సోమిరెడ్డి ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఊరేగించారని అయినా ఇంకా సిగ్గు రాలేదంటూ గోవర్థన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రేశితా టెక్నాలజీ ఎవరిదో తమకు తెలియదని దీనిపై సమగ్ర విచారణ జరపాలని కాకాని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.