విశాఖపట్నం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్. వైయస్ఆర్ రైతు దినోత్సవంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 

చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ విషసర్పమంటూ అభివర్ణించారు. గత ఎన్నికల్లో ఆసర్పం కోరలు ప్రజలు పీకేశారని అయినా బుద్ధిరాలేదని విమర్శించారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఐదేళ్లపాలనలో చేయలేని పనులను కేవలం నలభై రోజుల్లో సీఎం జగన్ చేసి చూపించారని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో కరెంట్ కోతలకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలే కారణమని ఆరోపించారు. విద్యుత్ బకాయిలు ఒక్కొక్కటి తమ ప్రభుత్వం చెల్లించుకుంటూ వస్తోందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కోతలు లేకుండా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

రైతులకు విత్తనాల సరఫరాలో విఫలమైందని ప్రభుత్వాన్ని నిందించడం చాలించాలంటూ టీడీపీపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే రైతులకు ఈ పరిస్థితి నెలకొందన్నారు. 

మే నెల వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులు ఇబ్బంది పడతారని ముందుగా గ్రహించలేకపోయారా అని నిలదీశారు. ఇదే నా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ నిలదీశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత నారా లోకేశ్‌కు గానీ టీడీపీ నేతలకు గానీ లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే అమర్ నాథ్.