అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరో కీలక పదవి వరించింది. టీటీడీ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఛాన్స్ కొట్టేశారు చెవిరెడ్డి. టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తుడా ఛైర్మన్‌ కు ప్రాతినిథ్యం కల్పించే అంశంపై 
చట్ట సవరణకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఆయన ఆ ఛాన్స్ కొట్టేశారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే సామాజిక కారణాల వల్ల మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు. 

మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన చెవిరెడ్డిని ప్రభుత్వ విప్ గా నియమిస్తూ శాంతింపజేశారు సీఎం జగన్. అంతేకాదు తుడా చైర్మన్ గా కూడా నియమించారు. తాజాగా టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి పదవి దక్కకపోతేనేం మూడు పదవులు కొట్టేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.