ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనలు తెలియజేస్తున్న విపక్షాలు.. ఇంధన ధరలపై చేయరేం అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లపై ఆయన విరుచుకుపడ్డారు.
ఏపీలో పెంచిన విద్యుత్ చార్జీలపై (electricity charges ) నిరసనలు తెలుపుతున్న టీడీపీ (tdp) , జనసేనలు (janasena) పెరిగిన ఇంధన ధరలపై (fuel charges) ఆందోళనలు ఎందుకు చేయట్లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (ambati rambabu) నిలదీశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాలో మాట్లాడిన అంబటి..పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం పెంచితే లోకేష్ (nara lokesh) నోరు విప్పట్లేదంటూ దుయ్యబట్టారు. పెరిగిన ఇంధన ధరలపై నిరసనలు చేయాలంటే భయమేస్తోందా? అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (pawan kalyan) పవర్ స్టార్ అన్న బిరుదు ఉందన్న ఆయన.. ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై తన పవర్ చూపించవచ్చు కదా అంటూ సెటైర్లు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిణామాలతో విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పలేదని రాంబాబు స్పష్టం చేశారు. తాజాగా పెరిగిన విద్యుత్ చార్జీలతో రూ.1400 కోట్ల భారం మాత్రమే ప్రజలపై పడితే టీడీపీ మాత్రం 42 వేల కోట్ల భారం వేశారని దుష్ప్రచారం చేస్తోందని అంబటి రాంబాబు మండిపడ్డారు.
విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబేనని... అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచింది టీడీపీ ప్రభుత్వమేనంటూ ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని రాంబాబు గుర్తుచేశారు. పేదల ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వం రూ.లక్షా 35 వేల కోట్లు వేసిందని ఆయన తెలిపారు. కొత్త జిల్లాలు, సచివాలయాలతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని... వీటిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారంటూ అంబటి ఫైరయ్యారు. లోకేష్ పగటి పూట లాంతర్లు పట్టుకుని తిరుగుతున్నారంటూ సెటైర్లు వేశారు.
కాగా.. Andhra Pradesh లో power charges పెంచిన సంగతి తెలిసిందే. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.40 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 126-225 యూనిట్ కు రూ. 1.57 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.
226 నుండి 400 యూనిట్లకు యూనిట్ కు రూ. 1.16 పెంచారు. 400 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారిపై రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. కేటగిరిలను రద్దు చేసి ఆరు స్లాబ్ లను తీసుకొచ్చినట్టుగా ఏపీ ఈఆర్‌సీ చైర్మెన్ ప్రకటించారు. 2016-17 లో యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 5.33 ఖర్చు అయిందని 2020-21 నాటికి యూనిట్ విద్యుత్ ఖర్చు రూ. 6.87కి పెరిగిందని ఈఆర్‌సీకి ఏపీ విద్యుత్ శాఖకు చెందిన డిస్కం కంపెనీలు వివరించాయి.
పెరిగిన విద్యుత్ ఖర్చుల మేరకు చార్జీల పెంపును అంగీకరించాలని డిస్కంలు ఈఆర్‌సీని కోరాయి. దీంతో డిస్కంలకు విద్యుత్ చార్జీలను పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చినట్టుగా ఈఆర్‌సీ చైర్మెన్ నాగార్జున రెడ్డి వివరించారు. ఇప్పటికే తెలంగాణలో కూడా విద్యుత్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. యూనిట్ కు 50 పైసల నుండి రూ. 2 ల వరకు చార్జీలను పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంపును విపక్షాలు తీవ్రంగా తప్పు బడుతున్నాయి. 125 నుండి 225 యూనిట్ విద్యుత్ ను వినియోగించే వినియోగదారులు ఎక్కువగా రాష్ట్రంలో ఉంటారు.
వీరిపై భారం మోపారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుతో రూ. 4,400 కోట్ల భారం వినియోగదారులపై పడనుంది. కోటి 70 లక్ష మందిపై విద్యత్ చార్జీల భారాన్ని డిస్కంలు మోపాయి..వివిధ కేటగిరిల కింద రూ. 1400 కోట్ల భారం పడనుంది. 75 యూనిట్ల లోపు వాడే వినియోగదారులు రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది ఉంటారు.మూడేళ్లలో ట్రూప్ అప్ చార్జీల పేరుతో రూ. 3 వేల కోట్ల వసూలుకు ఈఆర్సీ అనుమతిని ఇచ్చింది.2014 నుండి 2019 వరకు సర్ధుబాటు చార్జీల పేరుతో వసూళ్లు చేశాయి డిస్కం సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త టారీఫ్ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఆగష్టు నుండి ట్రూఆప్ చార్జీలను వసూలు చేయనున్నారు.
