హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఏ నాయకుడు చేయని సాహసం చేసిన వీరవనిత. 

పార్టీ అధినేత కంటే ముందే మరో ప్రజాప్రస్థానానికి నాంది పలికారు. ప్రజాప్రస్థానం పేరుతో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నడచిన అడుగుజాడల్లో నడుస్తూ రాజన్నను మరపించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి చేరువయ్యారు. 

అంతేకాదు ఆస్తుల కేసులో పార్టీ అధినేత వైఎస్ జగన్ జైలుకు వెళ్తే పార్టీ కార్యక్రమాలను దగ్గర ఉండి పర్యవేక్షించిన నేత. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయురాలిగా, అండగా నిలవాల్సిన అన్నకే తోడుగా ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లో ఆమెకంటూ కీలక పాత్ర పోషించారు. 

ఆమె ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ. ఆమెనే వైఎస్ షర్మిళ. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతలా కష్టపడ్డారో 2019 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువగా కష్టపడ్డారు. మండుటెండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

నెత్తిన సూర్యుడు మంటపుట్టిస్తున్నా అన్నను సీఎం కుర్చీపై చూడాలన్న లక్ష్యంతో వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అండగా జోరుగా ప్రచారం నిర్వహించిన షర్మిల ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

 బైబై బాబు, బై బై బాబు, బై బై పప్పు కూడా అంటూ ఆమె ఇచ్చిన నినాదం ఇప్పటికీ మార్మోగుతోంది. ఈ స్లోగన్ యువత, ప్రజల్లోకి మిస్సైల్ లా దూసుకుపోయింది. అందుకు నిదర్శనమే టిక్ టాక్ లో ట్రోలింగ్. ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల వదిలిన మాటల తూటాలు అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించాయి. 

ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల ఈసారి రాజకీయాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కడప పార్లమెంట్ నుంచి లేదా ఒంగోలు లోక్ సభ నుంచి నర్సాపురం లోక్ సభ నియోజకర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. 

కానీ ఆమె ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేశారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు పలు సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి. 

అటు బీజేపీ సైతం వైఎస్ జగన్ దే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పిస్తారన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే పార్టీలో ముఖ్యపదవి ఇస్తారా లేక నామినేటెడ్ పదవి ఇస్తారా అన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ కుటుంబ సభ్యులు షర్మిలకు ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుందని సూచిస్తున్నారట. చంద్రబాబు సీఎం అయితే బావమరిది బాలయ్యను హిందూపురం ఎమ్మెల్యేగా, కొడుకు నారా లోకేష్ ను ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశారని గుర్తు చేస్తున్నారట. 

అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయితే తనయుడు కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. తనయ కవిత నిజామాబాద్ ఎంపీగా పని చేస్తున్నారు. అలాగే జగన్ సీఎం అయితే సోదరికి వారిలాగే కీలక స్థానం ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇక ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో ఆమెకు నామినేటెడ్ పదవి ఇచ్చి మంత్రి వర్గంలో పదవి ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. మరి వైఎస్ షర్మిల విషయంలో వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది మే 23న వెలువడే ఫలితాలే తేల్చాలి.