వైసీపీలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. రఘురామకృష్ణంరాజే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి రంగనాథరాజు వ్యాఖ్యానించారు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.

ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని రంగనాథరాజు అన్నారు. రఘురామకృష్ణంరాజు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజుకు బ్యానర్ కట్టేంత క్యాడర్ కూడా లేదని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు.

ఆయన వ్యవహారశైలి.. ఏరు దాటాకా తెప్ప తగలేసినట్లుగా వుందని... అసలు నర్సాపురంలో కరోనా నియంత్రణకు రఘురామకృష్ణంరాజు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో కరోనా నియంత్రణను ఆయన ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.

సీఎం జగన్ ఫోటో లేకుంటే ఆయన ఎంపీ అయ్యే వారు కాదని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఎంపీ వేరే ఉద్దేశ్యాలు పెట్టుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేబినెట్‌లో క్షత్రియులకు కూడా జగన్ చోటు కల్పించారని.. రఘురామకృష్ణంరాజుకు రాజకీయ నేత లక్షణాలు లేవని, ఎంపీ వ్యవహారశైలిని కార్యకర్తలే తప్పుబడుతున్నారని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను రఘురామకృష్ణంరాజును వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు. వివాదాల కోసమే ఆయన పనిచేస్తారని.. వైసీపీ నుంచి పోటీ చేశారు కాబట్టే రఘురామకృష్ణంరాజు గెలిచారని వారు వెల్లడించారు.

నిత్యం ప్రజల నోట్లలో నానేందుకు ఆయన నానా ప్రయత్నాలు చేస్తుంటారని వైసీపీ నేతలు ఆరోపించారు. మూడు పార్టీలు మారి రఘురామకృష్ణంరాజు ఎంపీ అయ్యారని వారు గుర్తుచేశారు.

ఎన్నికలకు 20 రోజుల ముందు పార్టీలో చేరి ఎంపీ అయిన విషయం మరిచిపోవద్దని వైసీపీ నేతలు హితవు పలికారు. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం రఘురామకృష్ణంరాజు ప్రయత్నించడం నిజం కాదా అని వారు ప్రశ్నించారు.

జిల్లా నేతలంతా కలిసి జగన్‌ను బతిమాలితేనే ఎంపీ టికెట్ ఇచ్చారని వైసీపీ నేతలు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్ వేవ్‌లోనే తామంతా గెలిచామని, అంత బలమైన నేతైతే రఘురామకృష్ణంరాజు స్వగ్రామంలో ఆయనకు ఎంత మెజార్టీ వచ్చిందని వారు ప్రశ్నించారు.

ఒకవేళ రఘురామకృష్ణం రాజు సొంతంగా గెలిచానని భావిస్తుంటే వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులను ఏ రాజకీయ పార్టీ ఆదరించదని, వాపును బలుపు అనుకోవద్దని వారు ఘాటు వ్యాఖ్యలు చేశారు.