ఈవీఎంలు, వీవీప్యాట్‌లు తరలిస్తున్నారని తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిన ఎబిఎన్ ఛానెల్, ఆ సంస్థ విలేకరిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.
మచిలీపట్నం: ఈవీఎంలు, వీవీప్యాట్‌లు తరలిస్తున్నారని తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిన ఎబిఎన్ ఛానెల్, ఆ సంస్థ విలేకరిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, డీఆర్ఓ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో భద్రపర్చిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లు తరలిపోతున్నాయని ఈ నెల 13 వ తేదీన ఏబీఎన్ ఛానెల్ ఈ కథనాన్ని ప్రసారం చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. తప్పుడు సమాచారంతో వార్తను ప్రసారం చేయడంతో జిల్లా ప్రజలు , అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు.
తప్పుడు వార్తను ప్రసారం చేసిన ఏబిఎన్‌పై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని భద్రపరచిన యూనివర్శిటీ స్ట్రాంగ్ రూంలలోకి ఏబీఎన్ విలేకరి ప్రవేశించడంతో భద్రతా ఏర్పాట్లలోని డొల్లతనం బయటపడిందన్నారు.
ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ను అంటూ సదరు విలేకరి దర్జాగా లోపలికి ప్రవేశించి రహస్యంగా వీడియోలు తీసి చానల్‌లో ప్రసారం చేయడం ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేనని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించిన ఏబీఎన్ ఛానల్‌పై కలెక్టర్, ఎస్పీ తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
