తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 11న ఎన్నికల సమయంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వర్మతో పాటు ఆయన వాహనంపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.

దీనిపై వర్మ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వర్మపై దాడి చేసిన తిక్కాడ యోహాను, ఓసిపల్లి కృప అనే వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు పీఎస్‌కి చేరుకున్నారు.

అరెస్ట్ చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికి పోలీసులు ససేమిరా అనడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొబ్బరిబొండాలు, రాళ్లతో పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు.

ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు.