అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. చీరాల వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎడం బాలాజీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 

ఆమంచి కృష్ణమోహన్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బాలాజీ ఇక పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. 

ఇకపోతే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరనున్న నేపథ్యంలో ఆ పార్టీలో విభేధాలు భగ్గుమన్నాయి. ఇటీవలే లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై చర్చించారు. 

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన మంచి ముహూర్తం చూసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ స్పష్టం చేశారు. దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న చీరాల వైసీపీలో విబేధాలు రచ్చకెక్కాయి. 

ఆమంచి రాకను చీరాల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎడం బాలాజీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి రాకతో తన సీటుకు ఎసరువస్తుందని భావించిన ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. 

వైఎస్ జగన్ ను ఆమంచి కలిసినప్పటి నుంచి అలకపాన్పు ఎక్కారు. హైదరాబాద్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసి ఎడం బాలాజీ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. చీరాల నియోజకవర్గంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల ఏర్పాట్లను ఆమంచి అడ్డుకున్నారని చివరకు ఓదార్పుయాత్రకు ఇబ్బందులు సృష్టించారని, ప్రజాసంకల్పయాత్రను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. 

ఆమంచి రాకను తాను స్వాగతించలేనని జగన్ కు స్పష్టం చేశారు. అయితే వైఎస్ జగన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాలాజీ టీడీపీ నాయకులకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. పార్టీలో చేరే అంశంపై చర్చించారు.