వైఎస్సార్‌సిపి నాయకులు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  మృతిపట్ల తమకు చాలా అనుమానాలున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు గతంలోనే ఈసారి జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సిపికి కంచుకోట లాంటి కడప జిల్లాను గెలుస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ఆ పార్టీకి చెందిన మంత్రులు కూడా ఇదే విషయాన్ని పలు కార్యక్రమాల్లో చెప్పారన్నారు. కడప జిల్లాలో గెలుపుపై వారి ధీమాను చూసే ఏదో కుట్ర జరుగుతుందని అనుమానం కలిగిందని... ఇప్పుడిలా వివేకానంద రెడ్డి మృతి  చెందారని పద్మ తెలిపారు. 

జమ్మలమడుగు ఎమ్మెల్యే, మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా ప్రకటించినప్పటి నుండే చాలా కుట్రలు జరుగుతున్నాయన్నారు. అందువల్లే జమ్మలమడుగు వైఎస్సార్‌సిపి ఇంచార్జిగా వ్యవహరిస్తున్న వివేకానంద రెడ్డికి అసాధారణ మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అధికార పార్టీకి చెందిన నేత, ప్రస్తుత మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆకృత్యాల గురించి కడప జిల్లా ప్రజలందరికి బాగా తెలుసని పద్మ అన్నారు. 

వివేకా మృతిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ పై తమకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వ పెద్దల హస్తమున్న ఈ వ్యవహారంలో వారు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న నమ్మకం తమకు లేదన్నారు.  అందువల్లే అసలు నిజాలు బయటకు రావాలంటే ఈ కేసును సిబిఐ కి అప్పంగించాలని పద్మ డిమాండ్ చేశారు..