Asianet News TeluguAsianet News Telugu

అంగళ్లులో రాళ్ల దాడి టీడీపీ పనే.. నిగ్రహంతో వున్నాం, అందుకే తిరుగుతున్నారు : సజ్జల వ్యాఖ్యలు

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న రోడ్ షోపై వైసీపీ శ్రేణులు దాడికి దిగడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 

ysrcp leader sajjala ramakrishna reddy reacts on stone pelting on tdp chief chandrababu naidu road show at annamayya district ksp
Author
First Published Aug 4, 2023, 6:33 PM IST

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న రోడ్ షోపై వైసీపీ శ్రేణులు దాడికి దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై స్పందించారు. చంద్రబాబు పిచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన వెనుక వున్నది టీడీపీ నేతలేనని.. వాళ్లే దాడి చేసుకుని మాపై బురద జల్లుతున్నారని సజ్జల ఆరోపించారు.

తాము ఎంత రెచ్చగొట్టినా సంయమనంతో వున్నామని.. అందుకే టీడీపీ నేతలు తిరగగలుగుతున్నారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అంగళ్లు ఘటనలో యాక్షన్, రియాక్షన్ రెండూ చంద్రబాబుదేనని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేయించి, దీని వెనుకున్న వారిని బయటకు తీసుకొస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

కాగా.. అంగళ్లులో చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను చించేసిన వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దేవేంద్ర అనే ఎంపీటీసీ సహా పలువురు నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 

Also Read: చంద్రబాబు రోడ్ షోపై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడి .. రండి చూసుకుందాం అంటూ టీడీపీ చీఫ్ సవాల్

దీనిపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని ఆరోపించారు. డీఎస్పీ తన యూనిఫామ్ తీసేయాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాంబులకే తాను భయపడలేదని.. రాళ్లకు భయపడతానా అని ప్రశ్నించారు. దమ్ముంటే రండి చూసుకుందాం.. పులివెందులకే వెళ్లానని, తానూ చిత్తూరు జిల్లాలోనే పుట్టానని చంద్రబాబు పేర్కొన్నారు. 

పోలీసుల అండతోనే వైసీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎవరి జోలికి తాము వెళ్లమని.. మా జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. పుంగనూరుకు వెళ్తున్నానని.. అక్కడి పుడింగి సంగతి తేలుస్తానంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ రావణాసురుడిలాంటి ఎమ్మెల్యే వున్నాడని.. ఇలాంటి వాళ్లను భూస్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారని.. అంగళ్లు ఘటనపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios