జనంలో వుంటే మంచిదే .. కానీ ఎంత వరకు తిరుగుతాడో : పవన్ వారాహి యాత్రపై సజ్జల సెటైర్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తన కుమారుడి పాదయాత్ర కోసమే ఇంతకాలం పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఆపినట్లుగా తెలుస్తోందని ఆయన ఆరోపించారు.

ఇటీవల రాజమండ్రిలో జరిగిన మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మిని మేనిఫెస్టో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో దానికి ధీటైన మేనిఫెస్టోను తయారు చేసేందుకు వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ మేనిఫెస్టోను జగన్ పొగిడారని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా వుందన్నారు. ఆయన మాటలు పగటి కలలకు ఏమాత్రం తీసిపోవంటూ రామకృష్ణారెడ్డి చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని.. అందుకే ఢిల్లీ వెళ్తున్నారని సజ్జల ఆరోపించారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపైనా రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన యాత్రతో తమకేం అభ్యంతరం లేదని.. కానీ పవన్ ఎంత వరకు తిరుగుతాడో నమ్మకం లేదంటూ సెటైర్లు వేశారు. తన కుమారుడి పాదయాత్ర కోసమే ఇంతకాలం పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఆపినట్లుగా తెలుస్తోందని ఆయన ఆరోపించారు. పాదయాత్రలో నారా లోకేష్ వివేకా అంశంపై ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు తల్లి గర్భంలోనే మానసిక వైకల్యం ఏర్పడిందేమో అంటూ సజ్జల దుయ్యబట్టారు.
ALso Read: ఇన్నాళ్లు తెలంగాణలో దాచారా.. షూటింగ్‌లు లేనందునే టూర్ : పవన్ వారాహి యాత్రపై పేర్ని నాని సెటైర్లు
ఇకపోతే.. వారాహి యాత్రపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ తన యాత్రకు చంద్రవరం అని పేరు పెడితే బాగుండేదన్నారు. షూటింగ్‌లు లేకపోవడం వల్లనే పవన్ వారాహి యాత్ర మొదలుపెడుతున్నారని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు గెలవాలి.. జగన్ దిగాలి ఇదే పవన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు పాపులారిటీ తగ్గకుండా వుండేందుకే పవన్‌ను యాత్ర వేసుకోవాలని చంద్రబాబు ఆరోపించి వుంటారని పేర్ని నాని ఆరోపించారు. దసరా, సంక్రాంతి, ఉగాది పోయింది ఇప్పుడు ముహూర్తం కుదిరిందా అంటూ ఆయన సెటైర్లు వేశారు. వారాహి మీద పవన్ కళ్యాణ్‌కు టూర్ ప్యాకేజ్ వచ్చిందంటూ పేర్నినాని ఆరోపించారు. వారాహిని తెలంగాణలో దాచారా అంటూ ఆయన సెటైర్లు వేశారు.