ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలన్నీ ఓట్ల కోసమేనని ఆరోపించారు వైసీపీ నేత పార్థసారథి. విజయవాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఓటర్ల జాబితా సవరణ క్యాంపులో రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు.

ఎన్నికల సంఘం విచారణ జరిపి టీడీపీని ఎన్నికల నుంచి బహిష్కరించాలని పార్థసారథి డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో జరిపిన భూ కేటాయింపులపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

టెండర్లు, భూకేటాయింపుల్లో సీఎం బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని పార్థసారథి ఎద్దేవా చేశారు. సచివాలయాన్ని ఒక బ్రోకర్ ఆఫీస్‌గా మార్చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ ఆయన మండిపడ్డారు.

ఓటమి భయంతో సీఎం నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌, మోడీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది చంద్రబాబేనన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌లతో కలవాల్సిన అవసరం వైసీపీకి లేదని పార్థసారథి స్పష్టం చేశారు.