కర్నూల్: అధికార పార్టీ నాయకుడొకరు శుక్రవారం తెల్లవారుజామున అతి దారుణంగా హత్యకు గురయిన విషాద సంఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ కోసం ఇంట్లోంచి బయటకు వెళ్లిన సదరు నాయకుడు నిర్మానుష్య ప్రాంతంలోని ఓ కాలీ స్థలంలో శవమై కనిపించాడు. 

ఈ దారుణానికి సంబంధించి పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీకి చెందిన సుబ్బారాయుడు న్యాయవాది వృత్తిలో కొనసాగుతూనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడిగానూ పనిచేస్తున్నారు. 

అయితే ప్రతిరోజూ మాదిరిగానే శుక్రవారం తెల్లవారుజామున వాక్ కు వెళ్లిన అతడిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. స్థానిక విజయ పాల డైరీ సమీపంలో  కాలీ స్థలంలో మాటు వేసిన దుండగులు అతన్ని అడ్డుకుని కర్రలతో దాడి చేశారు. తలపై కర్రలతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. 

అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్ననంద్యాల తాలూకా పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించడంతో పాటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.